ప్రస్తుతం ప్రపంచం మొత్తం టీమిండియా-బంగ్లాదేశ్‌ల మధ్య జరిగే రెండో టెస్టుపై ఆసక్తిగా ఎదురుచూస్తోంది. అభిమానులతో పాటు ఇరుదేశాల క్రికెటర్లు ఎంతో ఉత్కంఠగా ఎదురుచూస్తున్న ఈ టెస్టు ప్రారంభానికి మరికొన్ని గంటలే సమయం ఉంది. యావత్ ప్రపంచ దృష్టిని ఆకర్షించిన ఈ తొలి డేనైట్ టెస్టుకు కోల్‌కతాలోని ఈడెన్ గార్జెన్స్ ఆతిథ్యమిస్తోంది. డేనైట్ టెస్టు కోసం రెగ్యులర్‌గా వాడే రెడ్ బాల్స్‌కు బదులు పింక్ బాల్స్‌ను వాడతారు. దీంతో ఈ రెండు బంతుల మధ్య తేడా ఏంటి, పింక్ బాల్‌తో మనోళ్లు నెగ్గుకరాగలరా? అనే అంశాలపై అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే ప్రస్తుత టీమిండియా సభ్యుల్లో కొంతమందికి పింక్ బాల్ క్రికెట్ ఆడిన అనుభవం ఉంది. సారథి విరాట్ కోహ్లి, వైఎస్ కెప్టెన్ అజింక్యా రహానే, ఉమేశ్ యాదవ్, రవిచంద్రన్ అశ్విన్‌లు తొలిసారి పింక్ బాల్ క్రికెట్ ఆడనుండటం విశేషం.
అయితే ఇప్పటికే టీమిండియాతో పాటు, బంగ్లాదేశ్ ఆటగాళ్లు ప్రత్యేక సెషన్లు ఏర్పాటు చేసుకొని ప్రాక్టీస్ చేస్తున్నారు. తొలుత బెంగళూరులో రాహుల్ ద్రవిడ్ పర్యవేక్షణలో టీమిండియా క్రికెటర్లు ప్రాక్టీస్‌లో పాల్గొన్నారు. అనంతరం కోల్‌కతాలో ఫ్లడ్‌లైట్ల వెలుతురులో ప్రాక్టీస్ చేస్తున్నారు. అయితే పింక్ బాల్ క్రికెట్ ఆడిన అనుభవం కొంతమందికి ఉండటం టీమిండియాకు లాభించే అంశం. ఎవరు, ఎక్కడ పింక్ బాల్ క్రికెట్ ఆడారో చూద్దాం..