మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో భారీ విజయం సొంతం చేసుకుని పలువురు రాజకీయ వారసులు చట్టసభలో అడుగుపెట్టబోతున్నారు. హరియాణా, మహారాష్ట్ర శాసన సభ ఎన్నికలు సహా దేశ వ్యాప్తంగా పలు స్థానాలకు జరిగిన ఉప ఎన్నికల ఫలితాలు గురువారం వెల్లడైన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా ఠాక్రే కుటుంబం నుంచి తొలిసారిగా ఎన్నికల బరిలో దిగిన ఆదిత్య ఠాక్రే తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికకాగా.. మహారాష్ట్ర మాజీ సీఎం విలాస్‌రావ్ దేశ్‌ముఖ్ కుమారులు అజిత్ దేశ్‌ముఖ్, ధీరజ్ దేశ్‌ముఖ్‌లు లాతూర్ జిల్లా నుంచి ఘన విజయం సాధించారు.
ఈ సందర్భంగా విలాస్‌రావ్ దేశ్‌ముఖ్ మరో కుమారుడు, బాలీవుడ్ హీరో రితేశ్ దేశ్‌ముఖ్ భావోద్వేగ ట్వీట్ చేశాడు. ' నాన్న మేము సాధించాం!! వరుసగా మూడోసారి అమిత్ లాతూర్ సిటీలో గెలుపొందగా(40 వేల మెజార్టీ), ధీరజ్ లాతూర్ రూరల్ అసెంబ్లీ స్థానాన్ని లక్షా 20 వేల భారీ మెజార్టీతో సొంతం చేసుకున్నాడు. లాతూర్ ప్రజలు మాపై ఉంచిన విశ్వాసానికి, నమ్మకానికి ధన్యవాదాలు' అని ట్విటర్‌లో పేర్కొన్నాడు. ఇక ఠాక్రే, విలాస్‌రావ్ దేశ్‌ముఖ్ వారసులతో పాటు... కేంద్ర మాజీ మంత్రి సుశీల్ కుమార్ షిండే కూతురు ప్రణతి షిండే గెలుపొందగా... మాజీ సీఎం నారాయణ రాణే కుమారుడు నితేష్ రాణేలతోపాటు పలువురు రాజకీయ నాయకుల వారసులు విజయం సాధించిన విషయం విదితమే.